jump to navigation

గాంధీగిరి vs దాదాగిరి ఫిబ్రవరి 9, 2007

Posted by కిష్టయ్య in అవీ ఇవీ.
10 వ్యాఖ్యలు

శంకర్ దాదా గారు మళ్ళీ తెర మీదకి వస్తున్నారు. Lage raho Munnabhai మొన్ననే చూసాను. చిరంజీవిగారే ఈ సినిమాకి తెలుగు versi0n లో హీరో అని తెలిసి నప్పటినుంచి నాలోబోల్డు సందేహాలు.

1. Munnabhai మొదటి దానిలో ఒక్క డుష్యుమ్ డుష్యుమ్ కూడా చెయ్యలేదు. ప్రేక్షకులకి రెండవ దానిలో కొంచం మెత్తగా కనపడినా అంత తేడా కనపడలేదు. కానీ మన శంకర్ దాదా అలా కాదు కదా. ముందో ఫైటు, వెనకో ఫైటు చేసేసాడు.

2.  Lage raho లో చాలా మటుకు గాంధీగారిని elevate చేసి మున్నాభాయిని సైడు character చేసారు. మరి మన చిరంజీవిగారి సినిమాలో చిరంజీవిగారినే సైడు చేసేస్తే ఎలా.

3. మున్నాభాయి తిన్నట్టు శంకర్ దాదా చెంప దెబ్బ తింటాడా?

4. Lage raho లో గాంధీగారు కనపడితేనే మున్నాభాయి ధైర్యంగా, ధీమాగా కనపడ్డాడు. మరి మన శంకర్ దాదా గారు గాంధీ గారికి తన పక్కన అంత ప్రాధాన్యతని ఇవ్వగలడా.

ఇంకా ఇలాంటి సందేహాలు చాలా ఉన్నాయి. చూద్దాం, మన పరుచూరివారు ఎమి చేస్తారో. పరుచూరివారు అని ఎందుకు అన్నాను అంటే, ఈ సినిమాకి కధే ప్రాధాన్యం.

ప్రకటనలు

ఎంత పెద్ద పేరో జనవరి 10, 2007

Posted by కిష్టయ్య in వార్తలు విశేషాలు.
3 వ్యాఖ్యలు

చాలా రోజుల కిందట, రీడిఫ్ లో థాయ్ లాండ్ దేశ రాజు గురించి, వారి కుటుంబీకుల గురించి రాసారు. థాయ్ ప్రజలకి, ఆయన దేవునితో సమానం. ఆయనకి అధికారం తక్కువే ఉన్నా, కీలక సమయాలలో మంచి నిర్ణయాలే తీసుకున్నారుట. అన్నిటి కన్నా ముఖ్యంగా నన్ను ఆకట్టుకున్నది ఏమిటంటే, ఆయన పేరు. బయట ప్రపంచానికి తెలిసిన పేరు, కింగ్ భూమిభోల్. కాని ఆయనకి పట్టాభిషేకం చేసినప్పుడు ఆయనకి పెట్టిన పేరు – ప్రభాత్ సోమదేజ్ ఫ్రా పరమింద్ర మహా భూమిభోల్ అదుల్యదేజ్ మహీతలాధిభేట్ రామాధిబోధి చక్రినరుబోదినధార సాయమిందరాధిరాజ్ బోరోమనత్భోపిత్

2006 పోయి 2007 వచ్చే ఢాం ఢాం ఢాం జనవరి 9, 2007

Posted by కిష్టయ్య in నా విశేషాలు.
1 comment so far

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఒక వారం ఆలస్యంగా అయినా చెప్పాను అని అదో తృప్తి. 2006 పోయి 2007 వచ్చే ఢాం ఢాం ఢాం అని సంబరమే తప్పించి వేరె చెప్పుకో తగ్గ మార్పులు ఏమీ లేవు. కానీ ఎప్పటి లాగే ఈ సంవత్సరం కూడా ప్రతిజ్ఞలు (resolutions) చేసేసాను/తీసుకున్నాను. ఎన్నింటికి న్యాయం చేస్తానో ఆ వెంకన్న బాబుకి, మా ఆవిడకి తెలియాలి, తెలుస్తాయి కూడా.

అందులో ఒకటి, చిన్ననాటి స్నేహితులందరి emails తెలుసుకుని, వారిని పలకరించాలి. ఇది నాకు అత్యంత ముఖ్యమైనది.  ఈ ప్రతిజ్ఞల పట్టీలో ప్రతీ ఏడూ ఉండేది, వారానికి ఒక్కసారైనా వ్యాయామం చెయ్యడం. కొట్టులో కూర్చుని పని చేసేవాడిని నాకెందుకే వ్యాయామం అంటే వినదు మా ఆవిడ. ఉత్తినే కూర్చుంటున్నారు కాబట్టే వ్యాయామం అని ఆవిడ వాదన.

చూద్దాం ఏవి ఎంత వరకూ పాటిస్తానొ.

నవ్వు నవ్వించు నవంబర్ 23, 2006

Posted by కిష్టయ్య in నా విశేషాలు.
7 వ్యాఖ్యలు

నాకు నవ్వడం వచ్చు కానీ నవ్వించడం అంతగా రాదు. ఎక్కడైనా విన్న హాస్యోక్తిని కూడా సరిగ్గా చెప్పి నవ్వించడం రాదు అని నాకు నా చిన్న తనంలోనే తెలిసిపోయింది. పదిహేను సంవత్సరాలు అయినా నాకు ఇంకా గుర్తు ఉంది. ఆ రోజు స్కూలుకి శెలవలు అయ్యాక మొదటి రోజు. మాష్టారుగారు పాఠాలు ఇంకా మొదలు పెట్టలేదు. ఏమి చెప్పాలో తెలియక, ఒకొక్కరిని ముందుకు వచ్చి ఒక జోక్ చెప్పమన్నారు. ఒకొక్కొరు వస్తున్నరు. వారి జోకులకి ఒకసారి నవ్వుతున్నాము, మరొకసారి నవ్వలేక ఏడుస్తున్నాము. నేను ధైర్యం చేసి ముందుకు వచ్చి ఒక joke చెప్పాను. చెప్పాక తెలిసింది ఏమిటీ అంటే, joke ని ఎక్కాలు అప్పచెప్పినట్టుగా గబగబ చెప్పేసాను. ఎవ్వరికి నవ్వు రాలేదు. పోనీ అక్కడితో ఆపెయ్యలేదు, అర్ధం అవ్వలేదేమో అని వివరించడం మొదలు పెట్టాను. అప్పుడు వెనక బెంచీ వాళ్ళందరు పగలబడి నవ్వడం మొదలు పెట్టారు. నేను ఏడుపు మొహం పెట్టుకుని వెనక్కి వచ్చేసాను.

అప్పటి నుంచి ఏ joke విన్నా గమనించడం మొదలు పెట్టాను. Timing చాలా ముఖ్యమని తెలిసింది. అలాగే సంధర్భం కూడా. అలాగే సినిమాలో వచ్చే హాస్య సన్నివేసాలని jokes లా చెప్పడంలో మజా లేదని కాలేజీలో తెలుసుకున్నాను. 

ప్రస్తుతానికి నవ్వించడానికి ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాను.

మాటల మూటలు అక్టోబర్ 20, 2006

Posted by కిష్టయ్య in తెలుగు పదాలు.
1 comment so far

సమయం: సాయంత్రం నాలుగు గంటలు.

ఈరోజు బేరాలు తక్కువగా ఉన్నాయి. పని కూడా అంతగా లేదు. కప్పు కాఫీ తాగివద్దామని లేచా. కొట్టుకి తాళం వేసి అయ్యరు హొటలు వైపు నడవడం మొదలు పెట్టాను. బుర్ర నిండా ఏవో ఆలోచనలు. పది నిమిషాలలో హొటలు వచ్చేసింది. అయ్యరు నన్ను చూడగానే నవ్వి, టేబుల్ చూపించాడు. అయ్యరు అసలు పేరు ఎవ్వరికి తెలియదు. ఆయనకి కూడా గుర్తు లేదేమో. కాఫీ ఆర్డర్ ఇచ్చి దిక్కులు చూస్తున్నా ఎవైనా తెలిసిన మొహాలు కనపడుతాయేమొ అని. జనాలు తక్కువగానే ఉన్నారు. ఇంతలో కాఫీ వచ్చింది. ఆ సువాసనకే ప్రాణం లేచొచ్చినట్టయ్యింది. మళ్ళీ చుట్టూ చూసా. ఒక వైపు కొంత మంది జూనియర్ కాలేజీ కుర్రాళ్ళు అనుకుంటా. పది మంది ఉంటారు. కబుర్లు చెప్పుకుంటున్నారు. “ఎరా ఎలా రాశావు ఫిజిక్స్ పేపర్.”“సార్ కి నా మొహం చూడగానే తెలిసిపోయినట్టుంది రా నేను ఏమీ చదవలేదని.”

“చదివినా చదవకపోయినా ఒకేలాగ ఉంటుంది లేరా నీ మొహం.”

“ఎమో రా. నా మీదే ఫిక్స్ చెసేసాడు రెండు కళ్ళూ. అస్సలు రాయలేక పోయా.”

“first year లోనే ఇలా అంటే, second year ఏమి చేస్తావు, EAMCET కి ఎలా prepare అవుతావు.”

ఇంకొకడు వచ్చాడు. “Hi రా”.

“ఏమిట్రా ఇంత లేట్. ఫిజిక్స్ exam లో పేపర్లు మీద పేపర్లు రాసేసావా ఏమిటి. సరిగ్గా చూసావో లేదో ఆయన ఇచ్చినవన్నీ ప్రొబ్లెమ్స్.”

“ఒకే step ని రెండేసి మూడేసి సార్లు రాసుంటాడు రా.”

నాకు నవ్వు వచ్చింది. పేపర్లు మీద పేపర్లు అని వింటే నాకు నా classmate ఒకడు గుర్తుకొచ్చాడు. వాడు రాసిన పేపర్లు కానీ అమ్మితే ఒక గ్రంధాలయాన్నే కొనచ్చు అని హేళన చేసేవాళ్ళం.

కాఫి పని చెయ్యడం మొదలు పెట్టింది. ఈ కుర్రాళ్ళ మాటలు వింటుంటే ఇంకో ఆలోచన వచ్చింది. వీళ్ళ మాటలలో english పదాలు వినపడ్డాయి. ఎవరైనా english పదాలు వాడినప్పుడు వాటి అర్ధాలు తెలుగులో తెలియక వాడుతారా లేక వారి భావన సులువుగా వ్యక్తపరచ వచ్చు అనే అభిప్రాయంతో నా లెక style కొసమా? నేను ఎందుకు చేస్తాను? ఇలా అలోచిస్తూ బయటకి వచ్చా.

కొట్టు వైపు నడుస్తూ ఇలా అలోచిస్తున్నా. నేను ఐతే భావన సులువుగా వ్యక్తపరచ వచ్చు అనే అభిప్రాయంతో english పదాలను వాడుతాను. కానీ ఈ సమాధానం నాకు అంత తృప్తి నివ్వలేదు. మనకి తెలియకుండానే బోల్డు english పదాలు మన మాటలలో దొర్లుతాయి. అంటే మనము చిన్నప్పటి నుండి ఇలాగే నేర్చుకున్నామా? అంతేగా మరి. ఉదాహరణకి ఈ పదాలను చూడండి. coffee, tea, fan, bulb, TV, radio, switch. ఇవి అన్నీ మనము మన ఇంట్లో వాడే పదాలే. ఆన్ని english పదాలే. దీని బట్టీ చూస్తే, పై ప్రశ్నకి జవాబు – “మనము మనకి తెలియ కుండానే english పదాలను రోజూ వాడుతాము. వీటిని “comfort words” అని అనవచ్చేమో. ఎవరి సౌకర్యం వారిది.” తప్పు పట్టాల్సిన పని లేదేమో. ఇప్పుడు ఈ విశ్లేషణ నాకు నచ్చింది.

కొట్టుకి వచ్చేసా. ఇంతలో మరో సందేహం. మరి మనకి తెలియని english పదాలకి తెలుగు అర్ధాలు ఎక్కడ దొరుకుతాయి అని. Google ని అడిగా. వెంటనే చెప్పేసింది, ఇక్కడ ఉంది అని.

డా. వేమూరి రావు గారు ఈ నిఘంటువును తయారు చేసారు.

ఈరోజు నేను నేర్చుకున్న తెలుగు పదాలు –

Glossary – అపూర్వ పద సంగ్రహము.

flexibility – వస్యత

చురక: ఈ విదంగా చూస్తే firefox ని ఫైర్ ఫాక్స్ అనే పిలిస్తే బాగుంటుందేమో. 🙂

ఈ చురక ఎవ్వరినీ ఉద్దేసించినది కాదని మనవి.

రాముడొచ్చే వేళ అక్టోబర్ 17, 2006

Posted by కిష్టయ్య in అవీ ఇవీ.
add a comment

సమయం: పొద్దున్న పది గంటలు దాటింది.

మాష్టారు గారి ఇంట్లో సందడి మొదలైంది. వారి అబ్బాయి, రామ్(కళ్యాణ రాముడు) ఈరోజే అమెరికా నుంచి వస్తున్నాడు. మాష్టారు గారి భార్య గారు అప్పుడే నాలుగు సార్లు వీధిలోకి వచ్చి వెళ్ళారు. రెండున్నర ఏళ్ళు అయ్యింది రామ్ వచ్చి. ఇది వరకు వచ్చినప్పుడు నాది కిళ్ళీ కొట్టే, కాస్త లాభాలు పట్టి ఇప్పుడు కిరాణా కొట్టు అయ్యింది. ఎన్ని సార్లు వచ్చినా ఉండేది పది రోజులే కదా. హమ్… అవి అన్నీ మనకి ఎందుకులే….ఇలా ఆలోచిస్తుండగా ఇంతలో మూర్తిగారు వచ్చారు.

నేను: ఏమిటండి లేటు.
మూ: “చికున్ గన్యా” వచ్చి తగ్గాక పొద్దున్నే లేవడానికి ఒపిక ఉండటం లేదు రా.

నేను: ఒంట్లో ఎలా ఉంది ఇప్పుడు.
మూ: ఒక రోజు బాగుంటుంది, ఒక రోజు బాగోదు. తగ్గుతోంది లే. అది సరే… రాముడు వస్తున్నాడుట ఈరోజు.

నేను: అవును.
మూ: ఈసారి ఏమి తీసుకొస్తాడొ.

నేను (నవ్వు ఆపుకుంటూ): మీ అబ్బాయి ప్రయాణం ఎప్పుడో.
మూ: అదే రా నా బెంగ. ఎప్పుడు వెల్తాడో ఏమో.

నేను: ఇప్పుడు ఇలానే అంటారు. వెళ్ళాక ఎప్పుడు వస్తాడొ ఎమిటో అంటారు.
మూ (నవ్వుతూ): వెళ్ళినా బెంగే వెళ్ళకపోయినా బెంగే.

ఈనాడు తీసుకుని చదవడం మొదలు పెడతారు మూర్తిగారు. నాకూ బేరాలు వేరే లేవు. కంప్యూటరు ముందు కూర్చున్నా.

మూ (పేపరు చదువుతూనే): నీకూ నాకూ ఎందుకు రా కంప్యూటరు.
నేను: సెల్ ఫోను వచ్చినప్పుడు మనము ఇలాగే అనుకున్నామా ఏమిటి.

ఇలా అంటుండగానే అయన సెల్ ఫోను మోగింది. ఆయన ఇంటి నుండే… పార్వతమ్మగారు ఏదో చెబుతున్నారు. పార్వతమ్మగారు మూర్తి గారి అమ్మగారు.

మూ: వంద గ్రాములు ఇంగువ కట్టరా. పద్దులో రాసుకో.

మూర్తిగారు వెళ్ళి పోయారు ఇంగువ తీసుకుని.

పార్వతమ్మగారికి ౮౦ ఏళ్ళు ఉంటాయి. ఈ వయస్సులో కూడ ఆవిడకి సెల్ ఫోను వాడకం తెలుసు. SMS కూడా చేస్తారుట. ఇంక వారి మనవడు అమెరికా వెడితే చాట్ కూడా చేసేస్తారేమో. Technology ఎంత సులువు అయిపోయిందో. ఎంత సులువు అయితే ఏమిటి సరిగ్గా ఉపయోగించు కోవాలి కాని. బాంబులు పేల్చడానికి, దోపిడీలు చెయ్యడానికి, రహస్యంగా ఫోటోలు వీడియోలు తీయడానికి వాడుతున్నారు. సరిగ్గా వాడితే అందరికీ ఒక దారి చూపించుతుంది కదా. మరి ఈ technology ని ఎలా వాడుకోవాలో చెప్పగలిగే వారు ఎవరు? మనమే కదా. అలోచన బాగానే ఉంది. మన ఊరిలో కాస్తోకూస్తో చదువుకున్న వారు బానే ఉన్నారు. అందరికీ నేను పరిచయమే. రోజూ ఎదో ఒక విధంగా కలుసుకుంటాము. అందరిని ఒక తాటి పైకి తెస్తె సరి.

అలా అలోచిస్తుండగానే ఒక కారు మాష్టారు గారి వీధిలోకి తిరిగింది. రాముడు వచ్చాడు.

మనము ఎప్పుడూ ఈ ఊరు వదిలి ఎక్కువ రోజులు వెళ్ళలేదు కాబట్టి తెలియదు కానీ, అన్ని రోజుల తరువాత మన ఆప్తులను చూసాక వచ్చే ఆనందోద్వేగాలు ఎలా ఉంటాయో ఊహించడం, చెప్పడం కష్టమే.

తొలి పలుకు అక్టోబర్ 17, 2006

Posted by కిష్టయ్య in అవీ ఇవీ.
5 వ్యాఖ్యలు

ప్రతీ రోజూ చేసేవే – ఐదున్నర కల్ల నిద్ర లేవడం, స్నానాధికాలు ముగించి కొట్టు తెరవడం. పాల బండి వాడు వచ్చి ప్యాకెట్లు పడేసి వెళ్ళి పోయాడు. మొత్తం 65. స్కూలు మాస్టారుగారి అబ్బాయి అమెరికా నుండి వస్తున్నాడుట. అతను ఉన్న పది రోజులు మామూలు కన్నా 3 ప్యాకెట్లు ఎక్కువ కావాలి అని నిన్ననే చెప్పారు. సరిపోతాయిలే అనుకున్నా.

పేపర్ వాడు ఇంకా రాలేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, వార్తాతో పాటు ఈ పది రోజులు Deccan Chronicle, Hindu కూడా తెప్పించమని మాస్టారుగారు చెప్పారు.

మాస్టారుగారి పిచ్చికాని, NRIలు internet ఉండగా, చేతిలో పట్టుకుని పేపర్ ఎందుకు చదువుతారు. అతను చదవక పోతే నష్టం నాకే కద. చూద్దాం రెండు రోజులు. అప్పుడే మానేద్దాం తెప్పించడం. అయినా, ఈ మధ్య వార్తలు తక్కువ, వాణిజ్య ప్రకటనలు ఎక్కువ అయ్యాయి. Internet అంటే ఒక ఆలోచన వచ్చింది. మనకి internet ఉంది కదా, ఒక printer కొని, internet లో మనకి అవసరమైన్ వార్తలనే సేకరించి, print తీసి, newspaper కింద అమ్మితే….. అమ్మో ఖర్చు మనకే పడుతుంది. అందులోను వాణిజ్య ప్రకటనలు లేనిదే newspaper అవుతుందా అని అడిగే వాళ్ళూ ఉన్నారు. మొన్నెప్పుడో ఈనాడులో “నిజాల గోడ పత్రిక” చదివా. Essential News అనేది సరైన పేరు. ఎర్రయ్యగారి లాగే నేను ఒక ఉపాయం చెయ్యాలి.

ఆలోచిస్తుండగానే వచ్చాడు పేపర్ అబ్బాయి. ఇంక పనులు మొదలు పెట్టాలి.